తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని శివగలైలో జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి వరి వంగడాలు బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా, అవి 3,175 ఏళ్ల నాటి వంగడాలుగా రుజువైందని తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

తమిళనాడు చుట్టు పక్కల చాలా చోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అధ్యయన ఫలితాల గురించి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ తవ్వకాల ద్వారా ఏం తెలుస్తోంది? తమిళనాడు పురావస్తు శాఖ, రాష్ట్రంలోని కీళడి క్లస్టర్, ఆదిచనల్లూర్, శివగలై, కోర్కై, గంగైకొండ సోలాపురం, మైలదుంపరాయి, కొడుమనాల్‌లో తవ్వకాలను చేపడుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర అసెంబ్లీలో ఈ తవ్వకాలకు సంబంధించిన 110 పేజీల నివేదిక గురించి ప్రస్తావించారు. ఈ నివేదికకు సంబంధించిన వీడియోతో పాటు చిన్న ప్రచురణను కూడా విడుదల చేశారు.

మదురై సమీపంలోని కీళడి క్లస్టర్‌లో 2015లో జరిపిన తవ్వకాల్లో భారీ భవనాల సముదాయం బయల్పడింది. దీంతో తమిళనాడు పురావస్తు సంపదపై అందరి దృష్టి నిలిచింది. కీళడి క్లస్టర్‌లో మూడు దశల పాటు తవ్వకాలు జరిపిన భారత పురావస్తు శాఖ ఆ తర్వాత దానిపై ఆసక్తి చూపలేదు. దీంతో ఆ బాధ్యతను తీసుకున్న తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ 2017 నుంచి తవ్వకాలను చేపడుతోంది.

కీళడిలో బయల్పడిన వివిధ రకాల వస్తువులు, భవనాలు అక్కడి నాగరికత ఉనికిని తెలియజేస్తున్నాయి. తమిళనాడులో నదీ పరివాహక పట్టణ నాగరికత లేదని అందరూ నమ్మేవారు. అంతేకాకుండా బ్రాహ్మి (తమిళ్) అక్షరాలను మౌర్యులు సృష్టించారని, వాటిని తర్వాత తమిళనాడుకు తీసుకువచ్చారని చెబుతుంటారు. కానీ కీళడి తవ్వకాలు, తమిళనాడు పట్టణీకరణ గురించి వాడుకలో ఉన్న నమ్మకాలను మార్చివేశాయి. బ్రాహ్మి లిపి పూర్వ కాలంలోనే తమిళనాడులో ఉపయోగించారని ఇందులో బయల్పడిన కుండల ద్వారా తెలుస్తోంది. యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా శాసనాలను విశ్లేషించినప్పుడు, అవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవని తేలింది.

అక్కడ నదీ పరివాహక మైదానాలకు సంబంధించినవిగా భావించే అరుదైన నలుపు రంగు కుండలు, పెద్ద భవనాలు, బ్రాహ్మి అక్షరాలతో కూడిన కుండలు, పూసలు, పాచికలు, రాళ్లను కనుగొన్నారు. ప్రస్తుత తవ్వకాల్లో వెలువడ్డ వస్తువుల ద్వారా గతంలో కీళడి క్లస్టర్ అనేది పెద్ద నగరంగా విలసిల్లినట్లు తెలుసుకున్నారు. శ్రీలంకతోనూ భారత్ వాణిజ్య సంబంధాలు జరిపి ఉండవచ్చని తమిళనాడు పురావస్తు శాఖ వెల్లడించింది. సూర్యుడు, చంద్రుడు నమూనాలు కలిగిన నాణేలతో పాటు శాసనాలు కూడా అక్కడ కనుగొన్నారు. ఆ నాణేలను, హార్దేకర్ నాణేలతో పోల్చి చూసిన నాణేల పరిశోధకురాలు సుష్మిత అవి మౌర్యుల కాలాని కంటే ముందునాటివని చెప్పినట్లు పురావస్తు శాఖ తెలిపింది. ఈ నాణేల ద్వారా కీళడి, ఉత్తర భారత దేశం మధ్య వాణిజ్య సంబంధాలున్నట్లు నిర్ధారించింది.

కీజి, కోర్కైలలో బయల్పడిన నల్లటి కుండలను భారత పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ రాకే తివారీ, బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్ర ఎన్. తివారీ విశ్లేషించారు. వారు కూడా నదీ పరివాహక ప్రాంతాలతో ఉత్తర భారత వాణిజ్య సంబంధాలను ధ్రువీకరించారు. కీళడిలో వెలువడ్డ వస్తువులను గతంలో కార్బన్ డేటింగ్ ఆధారంగా పరీక్షించగా అవి క్రీ.పూ 585 నాటివిగా తేలింది. ప్రస్తుత పరీక్షల్లోనూ అదే విషయం రుజువైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *