కేసీఆర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ భూములకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ గంటల వ్యవధిలోనే తయారుచేసి ఇచ్చిన నివేదిక చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తి చేశారని ప్రశ్నించింది. అధికారులు కారులో కూర్చుని నివేదిక రాసినట్లుగా ఉందంటూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదు వచ్చిందని ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా అంటూ చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తగినంత సమయం ఇవ్వాలని ఆదేశించింది. ఈటలకు చెందిన భూములలో ప్రభుత్వం సర్వే చేయడానికి ముందు నోటీస్ ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు ఉల్లంఘించారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తమపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ఈటల కుటుంబం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిపై విచారణ జరిపింది. ఈటల తరఫున న్యాయవాది ప్రకాశ్ రెడ్డి, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 6కి వాయిదా వేసింది.

ఏప్రిల్ 30న కొందరు రైతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. దానిపై, మీడియాలో వరసగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆరోపణలపై రెవెన్యూ, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఫిర్యాదు చేసిన రైతుల భూముల దగ్గర శని, ఆదివారాలలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడినట్టుగా మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు ముఖ్యమంత్రి. ఈటల నిర్వహిస్తున్న శాఖను బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ చేసిన సిఫార్సుకు గవర్నర్ తమిళిసై శనివారం ఆమోదం తెలిపారు. దాంతో ఈటల నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖను సీఎంకు బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి