జాగృతి ఈదెల వయసు 29 ఏళ్లు. గర్భవతి అయినట్లు తెలియగానే ఆమె తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. త్వరలో బిడ్డ పుట్టబోతున్నందుకు ఆనందంగా గడిపారు. దేశంలో కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పడుతున్న సమయం అది.

కానీ, ఒక్క నెల రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. కోవిడ్ కేసులు ఉధృతం అవ్వడం మొదలయింది. దాంతో, జాగృతి తన గదికే పరిమితం కావల్సి వచ్చింది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటకు వెళుతూ ఉండేవారు. దాంతో, ఆమె మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండేందుకు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. అప్పటికే భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. కానీ, గర్భవతులకు వ్యాక్సీన్ తీసుకోవడానికి ఆమోదం లభించకపోవడంతో జాగృతికి వ్యాక్సీన్ తీసుకునే అవకాశం లేదు.

ఇటీవల ప్రభుత్వం పాలిచ్చే తల్లులు వ్యాక్సీన్ తీసుకోవచ్చని ఆమోదం తెలిపినప్పటికీ, గర్భవతులు విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇది గర్భం దాల్చిన మహిళలను ఆందోళనలోకి నెట్టేసింది. “నాకు నవంబరులో కోవిడ్ సోకి, యాంటీ బాడీలు తయారయ్యాయి. కానీ, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. నాకు చాలా కంగారుగా అనిపించింది. నాకు తెలిసిన ఒకామెకు 9 నెలల గర్భంతో ఉండగా కరోనా సోకింది. ఆ బిడ్డ సిజేరియన్ ద్వారా పుట్టింది. తల్లి మాత్రం వెంటిలేటర్ పైకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె బ్రతికారు. కానీ, అలాంటి సంఘటనలు వింటున్నప్పుడు చాలా భయపెడుతూ ఉంటాయి” అని జాగృతి చెప్పారు.

ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చాలా హృదయ విదారకమైన కథలు కూడా ఉన్నాయి. దిల్లీలో ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన రెండు వారాల తర్వాత చనిపోయారు. ఆమె 35 సంవత్సరాల భర్త మాట్లాడుతూ ఈ విషయం తనకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు. భార్య లేకుండా ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలో ఆయనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఆయనకు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. “కరోనాను తేలికగా తీసుకోవద్దు” అని ఒక కోవిడ్ సోకిన డాక్టర్ చనిపోయే ముందు వీడియోలో చెప్పారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టం మీద మాట్లాడారు. ఆమె మరణించే సమయానికి 7 నెలల గర్భవతి. అంతకు ముందు రోజే ఆమె కడుపులోని బిడ్డ కూడా చనిపోయింది. సాధారణ మహిళల కంటే, గర్భం దాల్చిన వారికి కోవిడ్ సోకితే ముప్పు ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *