బిహార్‌లోని ముంగేర్ జిల్లాలో సోమవారం దుర్గా మాత విగ్రహ నిమజ్జన సందర్భంగా పోలీసులకు, భక్తులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.

ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు 12 ఏళ్ల అబ్బాయి కాగా, మరో వ్యక్తిని 19 ఏళ్ల అనురాగ్ పోద్దార్‌గా గుర్తించారు. ఈ ఘర్షణలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు ముంగేర్ డీఎం రాజేశ్ మీణా చెప్పారు. భక్తులతో సహా మొత్తం 20 మంది గాయపడ్డారని వివరించారు. ”విగ్రహ నిమజ్జన సందర్భంగా జనాన్ని నియంత్రించే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇంతకుమించి చెప్పలేం” అని ఆయన బీబీసీతో అన్నారు. ఘర్షణలో గాయపడ్డ స్థానికుడు రోహిత్ కుమార్ కూడా బీబీసీతో మాట్లాడారు.

”ముంగేర్‌లోని పెద్ద దుర్గా మాత విగ్రహం విషయమై వివాదం రేగింది. కహార్ జాతివాళ్లు విగ్రహాన్ని మోసుకుని వెళ్లడం మా ఆనవాయితీ. కానీ, పోలీసులు బలవంతంగా నిమజ్జనం చేయించేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ముంగేర్ సీనియర్ పోలీసు అధికారుల తప్పు ఉంది. వారి ఆదేశాలతోనే స్థానిక పోలీసు అధికారులు మాపై కాల్పులు జరిపారు” అని అన్నారు. ముందుగా జనమే తమపై దాడి చేశారని ముంగేర్ పోలీసులు తెలిపారు.

”మొదటగా రాళ్లు రువ్వింది, కాల్పులు జరిపింది కూడా జనమే. ఘటనాస్థలంలో నాటు తుపాకుల తూటా షెల్స్ కూడా దొరికాయి” అని చెప్పారు. మరో రెండు రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ మొదలవుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణ చెలరేగడంతో రాజకీయంగానూ వాతావారణం మరింత వేడెక్కింది.

హాథ్‌రస్ కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ: సుప్రీంకోర్టు ఉత్తర్వులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్‌రస్ (ఉత్తరప్రదేశ్) అత్యాచారం ఆరోపణల కేసుపై సీబీఐ విచారణను అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, సాక్షులకు భద్రత సహా అన్ని అంశాలనూ అలహాబాద్ హైకోర్టు చూస్తుందని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు స్థాయీ నివేదికలను అలహాబాద్ హైకోర్టుకు నివేదించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో సీబీఐని నిర్దేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని ముగ్గురు సభ్యల ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలన్న విజ్ఞప్తిపై స్పందిస్తూ.. దర్యాప్తు పూర్తయిన తర్వాత బదిలీ విషయాన్ని పరిశీలించవచ్చునని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *