భారత్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు “భారత్‌లో కోవిడ్-19 ఎండెమిక్ స్థితికి చేరుకుంటున్నట్లు అనిపిస్తోంది. అక్కడ వైరస్ వ్యాప్తి తక్కువ నుంచి మీడియం స్థాయి వరకూ ఉండచ్చు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. భారత్‌లో కరోనా రోజువారీ కేసులు 40 వేలకు దగ్గరగా నమోదవుతున్న సమయంలో డాక్టర్ స్వామినాథన్ ఈ మాట అన్నారు. ఆరోగ్య అంశాల నిపుణులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అసలు ‘ఎండెమిక్’ అంటే ఏంటి? దానివల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? భారత్‌లో కరోనా వైరస్ ఎండెమిక్‌గా మారడం అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ మేం వైరాలజిస్టుల సాయంతో సమాదానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం.

దేశ ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ టీ జాకబ్ జాన్ 2020 మార్చ్‌లో ఒక సైన్స్ పేపర్ రాశారు. వాస్తవాల ఆధారంగా దేశంలో ఈ వ్యాధి పాండెమిక్ నుంచి ఎండెమిక్ కాగలదని అందులో ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎండెమిక్ అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితి. “ఎండెమిక్‌గా మారి, పూర్తిగా అంతం కాని ఎన్నో వ్యాధులు ఇప్పుడు మన మధ్యే ఉన్నాయి. అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఎండెమిక్‌గా మారుతాయి. అంటే తట్టు, సాధారణ ఫ్లూ, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, మశూచి లాంటి వ్యాధులు. అవన్నీ ఎండెమిక్” అని డాక్టర్ జాన్ చెప్పారు.

కోవిడ్-19 జంతువుల నుంచి మనుషులకు వచ్చిందా లేదా అనేదానిపై పక్కా ఆధారాలు ఏవీ లభించలేదు. అలాంటప్పుడు కోవిడ్ ఎండెమిక్‌గా మారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు “ఇప్పుడు కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. అంటే ఇది ఎండెమిక్‌గా మారుతోంది. ఇది ఒకప్పుడు జంతువుల నుంచి మనుషులకు వచ్చుండచ్చు. కానీ ఇప్పుడు అది మనుషుల్లో వ్యాపిస్తోంది” అని డాక్టర్ జాన్ సమాధానం ఇచ్చారు. “పాండమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపించే ఒక వ్యాధి. ఇక ఎండెమిక్ అంటే జనాల మధ్యే ఉంటూ, ఎక్కువకాలం పాటు అలా ఉండిపోయే వ్యాధి. అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వ్యాపించవచ్చు”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *