Das Ka Dhamki Box Office Collections

Das Ka Dhamki Review: విశ్వక్ సేన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుత తరం నుండి అత్యంత ఆశాజనకమైన నటులలో ఒకరిగా మారారు మరియు విభిన్న స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ నటనలో తన బహుముఖ ప్రజ్ఞను చూపుతున్నారు. కానీ “పాగల్,””ఓరి దేవుడా” వంటి అతని గత కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుండి ఆశించిన స్పందనను అందుకోలేదు, అయితే ఈ సినిమాలు వాటిపై పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి తీసుకురాగలిగాయి.

Das Ka Dhamki Movie Review

విశ్వక్ సేన్ “ముఖచిత్రం”లో అతిధి పాత్ర పోషించిన తర్వాత “దాస్ కా ధామ్కీ” సినిమాతో మన ముందుకు వచ్చారు, దీనిని స్వయంగా నిర్మించి మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విశ్వక్సేన్ తన డైరెక్షన్ స్కిల్స్ మరియు పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించగలిగాడో లేదో తెలుసుకోవడానికి ఈ సినిమా వివరణాత్మక సమీక్షలోకి వెళ్దాం.

కథ

సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్‌కు మందు కనుగొనే ట్రయల్స్‌లో ఉన్న వైద్యుడు, తనకొక సొంత ఫార్మా కంపెనీ ఉంటుంది. అతను ప్రమాదంలో చనిపోవడంతో అతని స్థానంలో సంజయ్ లాగా కనిపించే వెయిటర్ కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) వస్తాడు. మొదట పేదవాడైన కృష్ణ కొన్ని రోజులు సంపన్న జీవితాన్ని ఆస్వాదించి, వచ్చిన పని పూర్తవగానే అక్కడనుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు, కాని తరువాత సంజయ్ మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటకి తీయాలని నిర్ణయించుకోవడం అనేక ఊహించని మలుపులకు దారితీస్తుంది.

దాస్ కా ధమ్కీ మూవీ నటీనటులు

“దాస్ కా ధమ్కీ” చిత్రంలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించగా, అతని సరసన నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో అక్షర గౌడ్, రతీ హుల్జీ, ప్రణతి రాయ్ ప్రకాష్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, శౌర్య కరే, అజయ్, హైపర్ ఆది, మహేష్ ఆచంట, భీష్మ చేతన్, పృధ్వీ రాజ్, రజిత, మురళీ గౌడ్, కాదంబరి కిరణ్, ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ శర్మ, సూర్య కుమార్, దువ్వాసి మోహన్, లక్ష్మీ హుస్సేన్, పూజా రెడ్డి, ప్రభు డంబో, సంతోష్ బాబు, శ్రీ వత్సా, అహనా.

విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్సేన్ సినిమాస్‌తో కలిసి వన్మయే క్రియేషన్స్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సినిమా పేరు దాస్ కా ధమ్కీ
దర్శకుడు విశ్వక్ సేన్
నటీనటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి,  ఇతరులు
నిర్మాతలు కరాటే రాజు
సంగీతం లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ దినేష్ కె బాబు
ఓటీటీ రిలీజ్ డేట్ ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ధ్రువీకరించలేదు

దాస్ కా ధమ్కీ సినిమా ఎలా ఉందంటే?

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వందలాది సినిమాలు విడుదలవుతున్నాయి దాంతో కొత్త కథలు రాయడానికి నిర్మాతలకు కొత్త ఆలోచనలు లేలేకుండాపోయాయి. వారు ఇప్పుడు కొన్ని సాధారణ ప్లాట్‌లను లేదా ఇప్పటికే ఉపయోగించిన ప్లాట్‌లను ఎంచుకుంటున్నారు, వాటిని స్క్రీన్‌పై ఆసక్తికరంగా కనిపించేలా చేయడానికి కొన్ని అంశాలను జోడిస్తున్నారు. దాస్ కా ధామ్‌కీ అలాంటి సినిమాల్లో ఒకటి, ఇది ఇప్పటికే చాలాసార్లు తెరపైకి వచ్చిన కథతో కూడుకున్నది, అయితే ఈ చిత్రం కొన్ని ఆసక్తికరమైన పాయింట్‌లను కలిగి ఉంటుందని విశ్వక్‌సేన్ నమ్మకంగా చెప్పాడు, కానీ తాను చెప్పినట్టుగా ఈ సినిమాలో అంత ఆసక్తికరమైన కథ గాని అంశాలు గాని ఏవి కనిపించవు.

దాస్ కా ధమ్కీ సినిమాలో ప్రేక్షకులను ఏ విధంగానైనా కనెక్ట్ చేసేలా చేసే ఉత్తేజకరమైన లేదా ఆశ్చర్యకరమైన అంశాలు ఏమీ లేవు. విశ్వక్ సేన్ పోషించిన రెండు పాత్రలలో వాస్తవికత లేకపోవడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వవు. తర్వాత సగభాగంలో కొన్ని ట్విస్ట్‌లు అనుకున్నంత కిక్ అయితే ఇవ్వవు.

నటన విషయానికి వస్తే, విశ్వక్ సేన్ యొక్క ద్విపాత్రాభినయం కొంత వరకు ఓకే, కానీ అతని ముఖంలో భావాలూ అతని మునుపటి సినిమాల నుండి పునరావృతమయినట్టు అనిపిస్తాయి. స్క్రీన్ పై మరింత ప్రభావవంతంగా కనిపించడానికి అతను తన పనితీరుపై ఇంకొంచెం కసరత్తుచేయాలి. నివేదా పేతురాజ్‌కి సినిమాలో పెద్దగా చేయాల్సిన పని ఏమీ లేదు మరియు ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. రావు రమేష్ ఎప్పటిలాగే బాగా చేసాడు. రోహిణి, అజయ్‌లకు పరిమితమైన పాత్రల్లో బాగానే నటించారు. మహేష్ ఆచంట, హైపర్ ఆది, ఇతర నటీనటులందరూ తమ పాత్రలకు అవసరమైనంత బాగా చేసారు.

టెక్నికల్ గా దాస్ కా ధమ్కీ పర్వాలేదనిపిస్తుంది. లియోన్ జేమ్స్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి మరియు ప్రేక్షకులు “పడిపోయిందే పిల్ల” పాటను థియేటర్‌లో తప్పకుండా ఆస్వాదిస్తారు. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ మరింత మెరుగ్గా ఉండి ఉండవచ్చు. తోడూర్ లాజరోవ్ జుజి, వెంకట్, రామకృష్ణన్ డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి.

దర్శకుడిగా విశ్వక్ సేన్ పెద్దగా ఆకట్టుకోలేదు. అతని మునుపటి చిత్రం “ఫలక్‌నుమా దాస్” రీమేక్ చిత్రం, కానీ అతను కొన్ని మార్పు చేర్పులతో ఆసక్తికరంగా మలిచగలిగాడు, కానీ ఈసారి “దాస్ కా ధమ్కీ” కథ మరియు మేకింగ్ ప్రేక్షకులను ఏ విధంగానూ ఆకట్టుకోలేదు. ఈ సినిమా మనకు “రౌడీ అల్లుడు,” “గౌతమ్ నంద,” నాని “జెంటిల్మెన్” మరియు కొన్ని ఇతర చిత్రాలను ఖచ్చితంగా గుర్తు చేస్తుంది.

మొత్తంమీద, “దాస్ కా ధమ్కీ” అనేది ఒక సగటు యాక్షన్ డ్రామా, చిత్రం పూర్తి నిడివిలో మనల్ని ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.

ప్లస్ పాయింట్లు:

  • సంగీతం
  • పోరాట సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • దర్శకత్వం

సినిమా రేటింగ్: 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *