సాంకేతిక సమస్యల కారణంగా ఓ స్కూల్ విద్యార్థి బ్యాంకు ఖాతాలో రూ. 900 కోట్లు జమ అయినట్లు ‘నమస్తే తెలంగాణ’ వార్తను ప్రచురించింది.

”బిహార్‌లోని కటిహార్‌ గ్రామానికి చెందిన గురుచరణ్‌ విశ్వాస్‌ స్కూల్‌ విద్యార్థి. యూనిఫాం, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి అతనికి స్కాలర్‌షిప్‌ రావాల్సి ఉంది. అకౌంట్లో డబ్బులు పడ్డాయా.. లేదా.. చెక్‌ చేసుకోవడానికి ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లాడు. అకౌంట్‌లో లాగిన్‌ అయ్యాడు. డబ్బును చూసి షాక్‌ అయ్యాడు. ఖాతాలో స్కాలర్‌ షిప్‌ డబ్బు పడలేదు కానీ ఎక్కడి నుంచో రూ.900 కోట్లు వచ్చిపడ్డాయి. ఆరో తరగతి చదువుతున్న, అదే గ్రామానికి చెందిన ఆశిష్‌ పరిస్థితి కూడా అదే. అతని ఖాతాలో రూ.6.2 కోట్లు జమయ్యాయి. ఇది తెలిసిన కటిహార్‌ గ్రామస్థులంతా తమ పాస్‌బుక్‌లు, ఏటీఎంలు తీసుకొని బ్యాంకులు, ఏటీఎంలు, ఇంటర్నెట్‌ సెంటర్లకు పరుగులు తీశారు. తమకు కూడా డబ్బులు వచ్చాయేమోనని అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఈ ఇద్దరు విద్యార్థులకు ఉత్తర్‌ గ్రామీణ్‌ బ్యాంకులో ఖాతా ఉంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బు జమ అయినట్టు బ్రాంచ్‌ మేనేజర్‌ చెప్పారని” నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు ‘సాక్షి’ కథనం పేర్కొంది. ”ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8నే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు అనుమతించడంతో 19న కౌంటింగ్‌ జరిపేందుకు ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ‘సాక్షి’ పేర్కొంది.

మద్యం దుకాణాల రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ‘వెలుగు’ కథనం వెల్లడించింది. ”సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయంచింది. గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం దుకాణాల విషయంలో రిజర్వేషన్ల అములుకు కేబినెట్ లో ఆమోదించారు. వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని” వెలుగు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *