నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా ‘నేషనల్ ఇడిబుల్ ఆయిల్ మిషన్ – పామాయిల్’కు పచ్చజెండా ఊపింది.

అంటే రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ చెట్ల పెంపకం, పామాయిల్ ప్రాసెసింగ్‌పై ప్రభుత్వం దృష్టిసారించనుంది. ముఖ్యంగా అండమాన్ అండ్ నికోబార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పంటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తారు. దీని ద్వారా పామాయిల్ దిగుమతుల ఖర్చును తగ్గించుకోవాలని భారత్ భావిస్తోంది.

ఆయిల్ పామ్ సాగు కోసం రూ.11,000 కోట్ల నిధులను రైతులకు ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించారు. ఇందులో రూ.8,844 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగతా రూ.2,194 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2025నాటికి పది లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్‌ను సాగుచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న పదేళ్లలో భారత్‌లో పామాయిల్ ఉత్పత్తిని 28లక్షల టన్నులకు తీసుకెళ్లాలని లక్ష్యం నిర్దేశించారు.

వీటిని సాగుచేసే రైతులపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారిస్తుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగులో ఎలాంటి నష్టం రాకుండా జాగ్రత్త వహిస్తుంది. ఇదివరకు హెక్టారుకు రూ.12,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ సాయాన్ని రూ.29,000కు పెంచారు. ఇప్పటికే సాగుచేస్తున్న చెట్ల విషయంలో ఒక్కో చెట్టుకు రూ.250 చొప్పున ప్రత్యేక సాయం అందిస్తారు.

పామాయిల్‌ను భారీగా దిగుమతి చేస్తున్న భారత సంస్థల్లో బీఎల్ అగ్రో ఒకటి. ముఖ్యంగా ఇండోనేసియా, మలేసియాల నుంచి ఈ నూనెను దిగుమతి చేస్తున్నారు. తాజా విధానంపై బీఎల్ అగ్రో చైర్మన్ ఘనశ్యామ్ ఖందేల్వాల్ బీబీసీతో మాట్లాడారు. ‘‘భారత్‌లో వంట నూనెల్లో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. మిగతా 35 శాతాన్ని మనం దేశంలోనే పండిస్తున్నారు. ఈ 65 శాతంలో.. 60 శాతం పామాయిలే ఉంటుంది. ఎందుకంటే మిగతా నూనెల్లో దీన్ని కలుపుతుంటారు’’ అని ఆయన అన్నారు. ‘‘పామాయిల్ దిగుమతుల కోసం ఏటా భారత్ రూ.50,000 కోట్లను ఖర్చు పెడుతోంది. తాజా మిషన్ ద్వారా ఈ ఖర్చును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్‌ను ఘనశ్యామ్ స్వాగతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *