
భారతదేశ విమానయాన రంగంలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాన నగరాల్లో ఒకటికి మించిన విమానాశ్రయాలను అనుమతించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీకి సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఉన్న ప్రధాన విమానాశ్రయాలు భారీ ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో, ఒక్క ఎయిర్‌పోర్ట్ సరిపోవడం లేదని మంత్రి తెలిపారు. అందుకే మల్టిపుల్ ఎయిర్‌పోర్ట్ మోడల్ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
ఈ విధానం ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు ఉపయోగకరంగా మారనుంది. కొత్త విమానాశ్రయాలు లేదా ఇప్పటికే ఉన్న చిన్న ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి ద్వారా ట్రాఫిక్‌ను విభజించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
విమాన రద్దీ తగ్గడం, టేక్-ఆఫ్, ల్యాండింగ్ ఆలస్యాలు తగ్గే అవకాశం, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సులభంగా విమానాశ్రయాలకు చేరుకునే సౌలభ్యం, టికెట్ ధరల్లో పోటీ పెరిగే అవకాశం, ఇలా విమానయాన రంగంపై ప్రభావం చూపబోతుంది.
ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ కనెక్టివిటీ బలోపేతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగావకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అంచనా.
భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడం కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందుకోసం మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త పాలసీలు, ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం కీలకమన్నారు.
ప్రధాన నగరాల్లో బహుళ విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వడం ద్వారా, దేశంలో వేగంగా పెరుగుతున్న విమానయాన అవసరాలకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం ప్రయాణికులు, విమానయాన సంస్థలు, అలాగే దేశ ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఊతంగా మారనుంది.