ఎవర్ గ్రాండ్. చైనాకు చెందిన ఈ బిజినెస్ జెయింట్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. పతనానికి చేరువలో ఉన్న ఈ కంపెనీ పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. మరి, నిజంగానే ఆ సంస్థ కుప్పుకూలుతుందా?

అప్పుల్లో కూరుకుపోయిన ఎవర్ గ్రాండ్ తన అప్పులకు సంబంధించిన సుమారు 84 మిలియన్ డాలర్ల( సుమారు రూ.619 కోట్లు) వడ్డీని చెల్లించాల్సి వచ్చింది. ఈ వారంలోనే తన పెట్టుబడిదారులకు డబ్బును వెనక్కి ఇవ్వడం ప్రారంభించిన ఆ కంపెనీ, నగదును సమీకరించలేక పోవడంతో ఆస్తుల రూపంలో చెల్లింపులు జరుపుతోంది.

ఎవర్‌ గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయి కా యాన్. చైనాలోని గ్వాంగ్ఝౌలో 1996 సంవత్సరంలో స్థాపించిన ఈ సంస్థను మొదట్లో హెంగ్డా గ్రూప్‌ అని వ్యవహరించేవారు. చైనాలోని 280 నగరాలలోని సుమారు 1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఈ కంపెనీ సొంతం. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఈ సంస్థ ఇతర కార్యకలాపాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించింది. వెల్త్ మేనేజ్‌మెంట్ నుంచి, ఎలక్ట్రిక్ కార్లు, ఫుడ్స్, డ్రింక్స్ తయారీ వరకు ఈ సంస్థ కార్యక్రమాలు విస్తరించాయి. గ్వాంగ్ఝౌ ఎఫ్‌సి పేరుతో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌ను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఈ సంస్థ అధినేత వ్యక్తిగత సంపద 10.6 బిలియన్ డాలర్లు ఉంటుంది.

సుమారు 300 బిలియన్ డాలర్ల రుణాలను సమీకరించి చైనాలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఎగర్‌గ్రాండ్ అవతరించింది. అయితే గత ఏడాది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర పెద్ద ఎత్తున ధనం పోగుపడటానికి వీలులేదు. దీంతో తన వ్యాపారాలను నిలబెట్టుకోవడానికి ఎవర్ గ్రాండ్ తన ప్రాజెక్టులను చౌక ధరలకు, డిస్కౌంట్‌లకు కట్టబెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ తాను చేసిన అప్పులకు పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులలో ఎవర్ గ్రాండ్ కంపెనీ షేర్ విలువ 85% పడిపోయింది. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీల దగ్గర ఆ సంస్థ బాండ్ల విలువ కూడా పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *