
భారతదేశవ్యాప్తంగా ఈరోజు నేషనల్ Mathematics డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు. గణిత శాస్త్ర ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం.
డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి కావడమే. గణిత ప్రపంచానికి ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటారు.
భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో జాతీయ గణిత దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో గణితానికి సంబంధించిన కార్యక్రమాలు, పోటీలు, ఉపన్యాసాలు నిర్వహిస్తారు.
డిజిటల్ ఇండియా, అంతరిక్ష పరిశోధనలు, ఇంజినీరింగ్, ఆర్థిక వ్యవస్థ, ఈ అన్ని రంగాల్లో గణిత శాస్త్రం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ గణిత దినోత్సవం ద్వారా గణిత శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తున్నారు.
జాతీయ గణిత దినోత్సవం గణిత శాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా మాత్రమే కాకుండా, జీవితానికి అవసరమైన విజ్ఞానంగా చూడాలని ప్రేరేపిస్తుంది. రామానుజన్ వంటి మహానుభావుల వారసత్వాన్ని స్మరించుకుంటూ, రాబోయే తరాలు గణితంలో రాణించాలని ఈ రోజు సందేశం ఇస్తోంది.