“చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్లు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షమూ మంచూ అసలు కురవనే కురవవు.” తరతరాలుగా ఈ భూమ్మీది ప్రజలు వాతావరణంలో వచ్చే మార్పుల గురించి చంద్రుని వంక చూస్తూనే ఉన్నారు. నిజమే, భూమి మీది వాతావరణాన్ని చంద్రుడు చాలా సున్నితంగా ప్రభావితం చేస్తాడు. భూ వాతావరణ వ్యవస్థల్లో కూడా చంద్రుని ప్రభావం ఉంటుంది.

450 కోట్ల సంవత్సరాల కిందట రెండు పురాతన గ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకొని, రెండూ కలిసిపోయి భూమిగా ఏర్పడ్డాయి. ప్రోటో ఎర్త్, థియా అనే ఈ రెండు గ్రహాలు ఢీకొనే సమయంలోనే ఒక చిన్న శిల పరిమాణంలోని ద్రవ్యరాశితో మన చంద్రుడు ఏర్పడ్డాడు. విశాలమైన అంతరిక్షంలో చంద్రుడు మనకు అత్యంత దగ్గరగా ఉంటాడు. మన ఉనికిలో అంతర్భాగంగా ఉంటాడు. తన కదలికల ద్వారా భూమి మీద ఉన్న జీవరాశిపై ప్రభావం చూపుతుంటాడు. చంద్ర గమనం వల్ల భూమిపై కలిగే ప్రభావాల గురించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. నిజంగా చంద్రుని ప్రభావం మనపై ఎప్పుడు ఉంటుంది? దీనితో పాటు చంద్ర ప్రభావం అంటూ చెప్పే కల్పిత అంశాలేంటో గుర్తించడం కూడా ఇప్పుడు మనముందున్న సవాలు.

సముద్రపు ఆటుపోట్ల ద్వారా భూమిపై చంద్రుడు కలిగించే ప్రభావాన్ని మనం చూడొచ్చు. భూమి ప్రతిరోజూ తన చుట్టు తాను తిరుగుతున్నప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం వల్ల సముద్రాలలోని నీరు సమీపంలోని నేల వైపుకు ఆకర్షితమవుతుంది. ఫలితంగా నీరు ఉవ్వెత్తుగా లేస్తుంది. అదే సమయంలో భూభ్రమణం కారణంగా ఏర్పడ్డ అపకేంద్ర బలంతో నీరు నేల నుంచి సముద్రం లోపలి వైపుకు కూడా అంతే ఎత్తుతో వెళ్తుంది. ఈ అలల కింద భూమి తిరుగుతూ ఉంటుంది. అందుకే సముద్రంలో ప్రతిరోజూ రెండు చొప్పున అధిక, అల్ప ఆటుపోట్లు ఏర్పడతాయి. ప్రతీ 18.6 ఏళ్లకు ఒకసారి చంద్రుని కక్ష్య భూమధ్యరేఖకు గరిష్టంగా +5 లేదా కనిష్టంగా -5 డిగ్రీలు కదులుతూ ఉంటుంది. 1728లో తొలిసారిగా గుర్తించిన ఈ ప్రక్రియను ‘లూనార్ నోడల్ సైకిల్’ అని పిలుస్తారు. భూమధ్యరేఖకు చంద్రుని కక్ష్య దూరంగా వెళ్లినప్పుడు అల్ప ఆటుపోట్లు, భూమధ్యరేఖకు సమాంతరంగా వచ్చినప్పుడు అధిక ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి.

వాతావరణ మార్పుల కారణంగానే సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెబుతోంది. దీనికి తోడు ‘లూనార్ నోడల్ సైకిల్’ కూడా ప్రభావం చూపిస్తే 2030ల నాటికి అధిక ఆటుపోట్లతో కూడిన వరదలు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించింది. సహజ సిద్ధంగా, మానవ చర్యల ఫలితంగా సముద్ర మట్టాలు ఎలా స్పందిస్తాయి. వాటివల్ల తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో అనే అంశంపై ‘నాసా సీ లెవల్ చేంజ్ సైన్స్ టీమ్’ లీడ్, పరిశోధక శాస్త్రవేత్త బెంజమిన్ హామ్లింగ్టన్ ఆసక్తి చూపుతున్నారు. హామ్లింగ్టన్ కాలిఫోర్నియాకు వెళ్లకముందు వరద ప్రభావిత ప్రాంతమైన కోస్టల్ వర్జీనియాలో నివసించేవారు.

‘తీర ప్రాంత సమాజాలపై వరదలు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉద్యోగ అవకాశాలను, వ్యాపార నిర్వహణను కష్టతరం చేస్తాయి. ప్రస్తుతం ఇది ఇబ్బందికర అంశంగా ఉంది. కానీ రానున్న కాలంలో దీన్ని మర్చిపోవడం కష్టమే. దీంతో బతకడం కూడా కష్టమే అవుతుంది’ అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *