ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు సీనియారిటీలో ముందున్నజస్టిస్ ఎన్.వి.రమణపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధానన్యాయమూర్తికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను బహిరంగం చేయడం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు, రాజ్యాంగ సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తుంది అంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ జగన్ చర్యను ఖండించింది.

ఈ నేపథ్యంలో అసలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలు ఎలా జరుగుతాయో పరిశీలిద్దాం. సుప్రీం కోర్టు భారతదేశంలోని అత్యున్నత న్యాయ స్థానం. ఇది దేశంలోని అన్ని న్యాయస్థానాలపై నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది. 1950 జనవరి 28న సుప్రీం కోర్టు స్థాపన జరిగింది. రాజ్యాంగంలోని 124 నుంచి 147 అధికరణలు భారత న్యాయ వ్యవస్థ కూర్పు, విధి విధానాలు, అధికార పరిధిని నిర్దేశించాయి. ప్రధానంగా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా గానీ లేదా కొన్ని తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైనవివాదాలకు సంబంధించిన కేసులను గానీ సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తుంది.

తొలుత ప్రధాన న్యాయమూర్తితో కలిపి 8 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన సుప్రీం కోర్టు క్రమేణా 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి, 1986లో 26కి, 2008లో 31 మంది న్యాయమూర్తులకు పెరిగింది.

అక్టోబరు 2020 నాటికి సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 30 మంది జడ్జీలు ఉన్నారు. అయితే, వీరి సంఖ్య 34 వరకు ఉండవచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకానికి అర్హతలు ఏమిటి?
భారత పౌరులై ఉండాలి.
కనీసం 5 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి.
లేదా 10 సంవత్సరాల పాటు హైకోర్టులో న్యాయవాద వృత్తి నిర్వహించి ఉండాలి.
లేదా ప్రముఖ న్యాయ నిపుణులు అయి, రాష్ట్రపతి దృష్టిలో ఆ వ్యక్తి ఒక విలక్షణ న్యాయవేత్తగా పరిగణించిన వారై ఉండాలి.
అయితే, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో న్యాయ నిపుణులను ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు లేవని బెనెట్ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు బీబీసీకి తెలిపారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం ఎలా జరుగుతుంది?

సుప్రీం కోర్టు జడ్జీల నియామకం భారత రాజ్యాంగంలోని 124 వ అధికరణం సెక్షన్ 2లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి జరుగుతుంది. సాధారణంగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన సీనియర్ జడ్జిని ఈ పదవిలో నియమిస్తారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖకు తన సూచన పంపిస్తారు. కేంద్ర న్యాయ శాఖ ఆ సూచనను ప్రధాన మంత్రి ప్రతిపాదనకు పంపిస్తుంది. దానిని పరిశీలించిన ప్రధాన మంత్రి.. ప్రధాన న్యాయమూర్తి పేరును రాష్ట్రపతికి సూచిస్తారు. ఉన్నత న్యాయస్థానాలలో జరిగే నియామకాలు భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో జరగాలన్న అంశాన్నిఅంబేడ్కర్ నిరాకరించినట్లు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు విశ్రాంత ప్రధానన్యాయమూర్తి ఎం ఎన్ రావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

“ప్రధాన న్యాయమూర్తి చాలా సమర్థుడైన వ్యక్తేనని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నప్పటికీ, ఆయనకు కూడా మనుషులందరికీ ఉండే భావాలే ఉంటాయి” అని అంబేడ్కర్ అభిప్రాయపడినట్లుచెప్పారు.

“రాజ్యాంగంలో ఎక్కడా కేవలం సీనియర్ న్యాయాధికారులనే ప్రధాన న్యాయమూర్తిగా చేయాలని పొందు పరచలేదు. ఇది కేవలం కార్య నిర్వాహక సౌలభ్యం కోసం రాజ్యాంగ సంప్రదాయంగాకొనసాగుతూ వస్తోంది” అని శ్రీధర్ చెప్పారు. రాజ్యాంగ నియమాలు రాజ్యాంగంలో రాత పూర్వకంగా పొందుపరిస్తే, కొంత కాలంగా పాటిస్తూ వస్తున్న రాజ్యాంగ సంప్రదాయాలు మాత్రం ఎక్కడాలిఖిత పూర్వకంగా ఉండవని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *