క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్ అంతటా. వర్షాలు పడతాయని, మే నెలాఖరు వరకు పిడుగులు పడవచ్చని అధికారులు హెచ్చరించినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

వచ్చే వారం రోజులు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదిరోజులుగా పిడుగుల ప్రభావం చాలాచోట్ల కనిపిస్తోంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డాయి. నిట్టనిలువుగా ఉండే ఈ మేఘాల వల్ల పిడుగులు పడుతున్నాయి. ప్రధానంగా విశాఖ మన్యం, నల్లమల అటవీ ప్రాంతాలు, ఈ సమీప గ్రామాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి.

పిడుగుల ప్రభావం 90 శాతం రైతులు, కూలీలు, పశువుల కాపరులపై ఉంటోంది. పొలాలు, ఆరుబయట పచ్చిక బయళ్లలో ఉండే వీళ్లు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళుతున్నారు. అలా వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లపై పిడుగులు పడి వాటి కింద ఉన్న వారు మృత్యువాతపడుతున్నారు. మూడురోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు చనిపోయిన ముగ్గురు వ్యక్తులు చెట్లకింద ఉన్నవారేనని గుర్తించారు. పిడుగు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చెట్ల కిందకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. ఉన్నచోటే కింద కూర్చుని చెవులు మూసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే దగ్గర్లో ఉన్న భవనాలు, రేకుల షెడ్లు వంటి వాటిల్లోకి వెళితే పిడుగుల ప్రభావం ఉండదని చెబుతోందని సాక్షి వివరించింది.

కొవిడ్‌ సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రెండో దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదనే భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండో దశే మాత్రమే కాదు.. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని.. మురుగునీటి విశ్లేషణ ద్వారా నెల రోజుల్లో వ్యాప్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *