సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఒకే టిక్కెట్ ధర అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య ప్రేక్షకుడికి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయం అని ప్రభుత్వం చెప్తోంది. అయితే దీనిపై వివాదం ఎందుకు రాజుకుంది?

ఏపీ సర్కారు ఇటీవల ఆన్‌లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను 01.12.2021న ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు రేట్లను నిర్దేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం తక్కువ ధర రూ.5 కాగా, ఎక్కువ ధర రూ. 250గా ఉంది.

సినిమా వెండి తెరను దాటి బుల్లి తెర, తాజాగా ఓటీటీ రూపంలోకి మారి అరచేతిలోని సెల్ ఫోన్‌కు చేరింది. అయినా కూడా పెద్ద తెరపై థియేటర్లలో సినిమా చూడటం సగటు ప్రేక్షకుడికి మంచి వినోదం. ఆ వినోదం అందించడమే కోసమే మేం సినిమాలు తీసేది అని సినీ పరిశ్రమ చెప్తుంటే… ఆ వినోదాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుడు దోపిడీకి గురికాకూడదనే టిక్కెట్లపై నియంత్రణ అంటున్న ప్రభుత్వాల మాటలతో చర్చ మొదలై….వివాదంగా మారుతోంది.

సినిమా థియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 35 జారీ చేసింది. దీని ప్రకారం ఉన్న రేట్ల కంటే ఎక్కువ వసూలు చస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మల్టీప్లెక్స్‌లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేటు రూ.250 మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ.100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ.60. ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. ప్రభుత్వ ధరల ప్రకారం కనిష్ఠంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5 కూడా ఉంది.

“ప్రాంతం ఏదైనా…అయా ప్రాంతాలకు ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరల ప్రకారం సినిమాలు వేయలేమని థియేటర్ల యాజమాన్యాలుగా మేం భావిస్తున్నాం. ఇలాగైతే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా…మొత్తం సినిమా పరిశ్రమే దెబ్బతింటుంది. ఇక పెద్ద సినిమాకైతే కోలుకోలేని దెబ్బ కిందే లెక్క. చిన్న సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు దెబ్బతింటారు. చిన్న సినిమా పది కోట్లతో అయిపోతుంది. కానీ భారీ సినిమా తీయాలంటే 200 కోట్లు పెట్టాల్సిన రోజులు ఇవి. అన్ని సినిమాలకి ఒకే ధర అంటే ఎగ్జిబిటర్లకు బాగానే ఉంటుంది. నిర్మాతలు నష్టపోతారు. అలా జరిగితే క్రమంగా పెద్ద సినిమాలు తీయడం మానేస్తారు. అలాగని చిన్న సినిమా చేయలేరు. ఎందుకంటే స్టేటస్ ఫీలింగ్ వస్తుంది. దాంతో క్రమంగా సినీ పరిశ్రమ కుప్పకూలిపోతుంది” అని విశాఖలోని కిన్నెర థియేటర్ యాజమాని పి. సాంబమూర్తి బీబీసీతో అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *